: మీడియా నన్ను దోషిని చేసింది.. నేను అమాయకుడిని.. వరుస ట్వీట్లలో మాల్యా
కోర్టు తనను దోషిగా తేల్చే వరకు తాను అమాయకుడినేనని మాజీ లిక్కర్ కింగ్ విజయమాల్యా అన్నారు. శుక్రవారం వరుసపెట్టి ట్వీట్లు చేసిన ఆయన మీడియానే తనను దోషిని చేసిందని మండిపడ్డారు. తన సారథ్యంలోని కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ బ్యాంకులకు బకాయి పడిన విషయంలో న్యాయపరంగా ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం రాలేదని, అటువంటప్పుడు దోషిగా ఎలా చిత్రీకరిస్తారని మీడియాపై మండిపడ్డారు. వ్యక్తిగత హోదాలో ఎంత రుణపడి ఉన్నాననేది విచారణలో తెలుస్తుందని అన్నారు. సాధారణంగా మన దేశంలో దోషిగా తేలే వరకు అమాయకుడిగానే పరిగణిస్తారని, కానీ వివిధ రకాల ప్రభావాలకు లోనైన మీడియా తనను దోషిగా ప్రకటించేసిందని ట్వీట్లో ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకులకు బకాయి పడిన కారణంగానే విదేశాలకు పారిపోయానని అంటున్నారని, కానీ తను వ్యక్తిగతంగా ఏనాడూ రుణాలు తీసుకోలేదని మాల్యా పేర్కొన్నారు.