: మూడు నెలలుగా నన్ను బెదిరిస్తున్నారు.. నా పేరు మోదీ.. నేనెవరికీ భయపడను.. ఎన్నికల ప్రచార సభలో ప్రధాని!
పంజాబ్‌లోని జలంధర్‌లో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెద్దనోట్ల రద్దు తర్వాత తనకు మూడు నెలలుగా బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. అయితే తన పేరు మోదీ అని, తానెవరికీ భయపడనని తేల్చి చెప్పారు. అవినీతిపై పోరాటం రాజకీయాలకు అతీతమని పేర్కొన్న మోదీ పెద్ద మొత్తంలో సంపద పోగేసుకున్న వారు తన చర్యలను జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. కాంగ్రెస్‌ది ఇక ముగిసిన అధ్యాయమని పేర్కొన్న ప్రధాని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. కొందరు వ్యక్తులు పంజాబ్ యువత ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఓ వింత పార్టీ అని, రాజకీయ అవసరాలను బట్టి స్వరూపం మార్చుకుంటూ ఉంటుందని అన్నారు. రాజకీయ అవకాశవాదంలో కాంగ్రెస్‌కు మంచి నైపుణ్యం ఉందని ప్రధాని ఎద్దేవా చేశారు.