: వరుడు లేకుండానే అట్టహాసంగా పెళ్లి.. వధువును ఆశీర్వదించి కానుకలు అందించిన బంధుమిత్రులు!
తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో శుక్రవారం ఓ విచిత్ర పెళ్లి జరిగింది. వరుడు లేకుండానే అట్టహాసంగా జరిగిన ఈ పెళ్లిని చూసేందుకు చుట్టుపక్కల వారు కూడా తరలివచ్చారు. వధూవరుల కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పద్మనాభపురానికి చెందిన సోఫియాకు పేచ్చిపారైకి చెందిన అజారుద్దీన్‌కు పెళ్లి కుదిరింది. ముస్లిం సంప్రదాయం ప్రకారం ఇటీవల ఘనంగా నిశ్చితార్థం కూడా జరిగింది. కంప్యూటర్ ఇంజినీర్ అయిన అజారుద్దీన్ ఉద్యోగ రీత్యా సౌదీలో ఉంటున్నాడు. వీరి వివాహం కోసం శుక్రవారం స్థానిక కల్యాణ మండపంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది.
సౌదీలో ఉన్న అజారుద్దీన్ గురువారమే భారత్ చేరుకోవాల్సి ఉంది. రూము నుంచి బయలుదేరిన ఆయన ట్రాఫిక్ జాం కారణంగా విమానాశ్రయానికి సకాలంలో చేరుకోలేకపోయాడు. దీంతో విమానం మిస్సయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న వధూవరుల కుటుంబ సభ్యులు నిరాశ చెందకుండా వరుడు లేకున్నా పెళ్లి జరిపించాలనే నిర్ణయానికి వచ్చారు. వరుడు అజారుద్దీన్ సోదరితో వధువు సోఫియా మెడలో సూత్రధారణ చేయించారు. అంతే పెళ్లి తంతు ముగిసింది. పెళ్లికి హాజరైన వారంతా వధువును ఆశీర్వదించి కానుకలు సమర్పించారు. ముస్లిం సంప్రదాయం ప్రకారం అంగీకార పత్రాలపై వధూవరులు సంతకాలు పెడితే సగం పెళ్లి అయిపోయినట్టేనని కాబట్టి సోఫియాకు పెళ్లి జరిగినట్టుగానే భావిస్తామని ముస్లిం పెద్దలు పేర్కొన్నారు.