: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఐరాస మాజీ కార్యదర్శి కొఫి అన్నన్ అభినందన.. మొహల్లా ఆరోగ్య కేంద్రాలు అద్భుతమంటూ కితాబు!
ఐక్యరాజ్య సమితి మాజీ ప్రధాన కార్యదర్శి కొఫీ అన్నన్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అభినందనల్లో ముంచెత్తారు. పేదలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించేందుకు ఢిల్లీలో చేపట్టిన మొహల్లా ఆరోగ్యకేంద్రాల పనితీరు అద్భుతమని కొనియాడారు. ఈమేరకు సీఎంకు లేఖ రాసిన అన్నన్ మొహల్లా ఆరోగ్య కేంద్రాలు విజయవంతమయ్యాయని, ఆకట్టుకునేలా ఉన్నాయని పేర్కొన్నారు. పేదలు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందుకుంటున్నారని అన్నారు. ఆరోగ్య భద్రత కోసం మీరు చేస్తున్న కృషి తమకు తెలుసంటూ ప్రశంసించారు. వాటిని మరింత విస్తృతం చేసి మిగతా రాష్ట్రాలకు ఆదర్శం కావాలని అన్నన్ ఆకాంక్షించారు. ఢిల్లీ వ్యాప్తంగా మొత్తం వెయ్యి మొహల్లా కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఆరోగ్య సేవలు, సౌకర్యాల విషయంలో ఢిల్లీ మెరుగైన స్థానంలో ఉంటుందని అన్నన్ లేఖలో పేర్కొన్నారు.