: నెలాఖరులో తిరుమల సందర్శించనున్న కేసీఆర్.. స్వామి వారికి 'తెలంగాణ మొక్కులు' సమర్పణ!

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిష్కృతమైతే సాలగ్రామ హారం, కంఠాభరణాన్ని కానుకగా సమర్పిస్తానని మొక్కుకున్న కేసీఆర్ త్వరలోనే ఆ మొక్కు తీర్చుకోనున్నారు. ఈనెల 31న బంధుమిత్ర సమేతంగా తిరుమలను సందర్శించనున్న కేసీఆర్ రూ.3.70 కోట్ల విలువైన 14.20 కిలోల సాలగ్రామ హారం, రూ.1.21 కోట్ల విలువైన కంఠాభరణం సమర్పించనున్నారు. అయితే ముఖ్యమంత్రి పర్యటనపై ఇప్పటి వరకు టీటీడీకి సమాచారం అందలేదు. ఈ నెలాఖరులో సీఎం షెడ్యూల్‌లో ఖాళీ ఉంటే కనుక కుటుంబ సభ్యులతో కలిసి యాత్రకు వెళ్లాలని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నట్టు సమాచారం.
కాగా తెలంగాణ ప్రభుత్వం తరపున శ్రీవారికి రూ.5 కోట్లతో సాలగ్రామ హారం, కంఠాభరణాలను తయారుచేయించి కానుకగా ఇవ్వాలని రెండేళ్ల కిందట అసెంబ్లీలో తీర్మానించారు. ఈ మేరకు ఆభరణాల తయారీ బాధ్యతను టీటీడీకి అప్పగిస్తూ రూ.5 కోట్లు సంస్థ ఖాతాలో జమచేశారు. స్వామి వారికి సమర్పించనున్న ఆభరణాలను కోయంబత్తూరుకు చెందిన కీర్తిలాల్ కాళిదాస్ కంపెనీ తయారుచేసింది.