: నా బిడ్డకు దక్కిన విజయం ఇది.. ఇంతకు మించిన ఆనందం ఇంకేం వుంటుంది?: శర్వానంద్ పై చిరంజీవి ప్రశంసలు
'ఇంద్రజా! ఈ సినిమా నీ కోసం చూస్తా'నని 'శతమానం భవతి' విజయోత్సవ సభలో చిరంజీవి అన్నారు. హైదరాబాదులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ప్రకాశ్ రాజ్, జయసుధ, నరేష్ వంటి బాగా అనుబంధమున్న నటులు నటించిన సినిమా ఇదని అన్నారు. నరేష్ ను ప్రతి ఏటా కుటుంబ ఫంక్షన్లలో కలుస్తుంటానని, తమ మధ్య మంచి అనుబంధం ఉందని అన్నారు. ఇంద్రజను చూసి చాలా కాలమైందని చెప్పారు. చిన్నప్పటి నుంచి శర్వానంద్ తమ ఇంట్లోనే ఉండేవాడని, రామ్ చరణ్, శర్వ ఇద్దరూ మంచి స్నేహితులని, చిన్నప్పటి నుంచి చాలా సౌమ్యంగా ఉంటాడని, సినిమాల్లో నటిస్తాడని అస్సలు ఊహించలేదని ఆయన చెప్పారు.
సినిమాల్లో నటిస్తానని శర్వ తనతో ఎప్పుడూ చెప్పలేదని, 'థమ్సప్' యాడ్ లో నటించాడని, తన సినిమాలో యంగ్ స్టర్ కావాలంటే ఇంట్లోనే ఉన్న శర్వను... 'నటిస్తావా?' అని అడిగానని, 'మీ సినిమాలో అయితే నటిస్తా'నన్నాడని, తనతోనే మొట్టమొదట కెమెరాను ఫేస్ చేశాడని ఆయన గుర్తు చేసుకున్నారు. నా బిడ్డకు మంచి విజయం దక్కిందంటే అంతకు మించిన సంతోషం ఏముంటుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా శర్వానంద్ చిరంజీవి కాళ్లకు నమస్కరించాడు. మంచి కుటుంబ కథా చిత్రాన్ని తీసిన దర్శకుడు, నిర్మాతలకు అభినందనలని ఆయన చెప్పారు.