: బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీపై దాడి... షూటింగ్ స్పాట్ లోనే ముఖంపై పిడిగుద్దులు
భారతీయ చలనచిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురయ్యే ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. బాలీవుడ్ భారీ చిత్రాల దర్శకుడిగా కీర్తి గడించిన సంజయ్ లీలా బన్సాలీపై దాడి జరిగింది. జైపూర్ లో 'పద్మావతి' సినిమా షూటింగ్ జరుగుతోంది. జైగఢ్ కోట వద్ద అల్లావుద్దీన్ ఖిల్జీ, రాణి పద్మావతి ప్రేమాయణంలో చోటుచేసుకునే కొన్ని సన్నివేశాలను సంజయ్ లీలా భన్సాలీ చిత్రీకరిస్తున్నారు. ఇంతలో షూటింగ్ స్పాట్ లోకి దూసుకొచ్చిన రాజ్ పుత్ కార్ణి సేన కార్యకర్తలు దర్శకుడి చెంపలు వాయించి, ముఖంపై పిడిగుద్దులు కురిపించారు.
రాజ్ పుత్ రాణిని హీనంగా చూపిస్తున్నారని, అల్లావుద్దీన్ ఖిల్జీతో రాణి పద్మావతి ప్రేమాయణం జరిపినట్టుగా చరిత్రను వక్రీకరిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిద్దరి మధ్య ప్రేమాయణంకు సంబంధించిన సన్నివేశాలు తొలగించి, జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అకస్మాత్తుగా జరిగిన ఘటనతో సినిమా యూనిట్ మొత్తం బిత్తరపోయింది. కాగా, ఈ సినిమాలో అల్లావుద్దీన్ ఖిల్జీగా రణ్ వీర్ సింగ్, రాణి పద్మావతిగా అతని నిజజీవిత ప్రేయసి దీపికా పదుకొనే నటిస్తున్నారు. 'పద్మావతి' భర్తగా షాహిద్ కపూర్ ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.