: క్రికెట్ చరిత్రలో అద్భుతం...ఆరు బంతుల్లో ఆరు వికెట్లు!
క్రికెట్ చరిత్రలో ఎవరూ ఊహించని అద్భుతాన్ని ఆస్ట్రేలియా క్లబ్ క్రికెటర్ సాధించాడు. క్రికెట్ లో సాధారణంగా హ్యాట్రిక్ నమోదు చేయడమే గొప్ప, అలాంటిది ఒకే ఓవర్ లో రెండు హ్యాట్రిక్ లు సాధించడం అసాధ్యం అంటారు. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి అద్భుతం అనిపించాడు గోల్డెన్ పాయింట్ క్లబ్ ఆటగాడు అలెడ్ క్యారీ.
ఆస్ట్రేలియాలో క్లబ్ క్రికెట్ బాగా ప్రాచుర్యం పొందింది. అందులో భాగంగా గోల్డెన్ పాయింట్ క్లబ్-ఈస్ట్ బల్లారత్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఈస్ట్ బల్లారత్ ఆటగాళ్లపై నిప్పులు చెరిగే బంతులతో అలెడ్ క్యారీ విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కేవలం ఆరు బంతుల్లో ఆరు వికెట్లు సాధించాడు. దీంతో 40 పరుగులకే ఈస్ట్ బల్లారత్ జట్టు కుప్పకూలింది. ఈ ప్రదర్శనపట్ల అతనే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు. తాను గతంలో హ్యాట్రిక్ దగ్గరగా చాలా సార్లు వచ్చానని, అయితే ఒక్కసారి కూడా హ్యాట్రిక్ సాధించలేదని, అయితే ఒకేసారి డబుల్ హ్యాట్రిక్ సాధించడం ఆనందంగా ఉందని అలెడ్ క్యారీ తెలిపాడు.