: ఖతర్‌లో యజమానుల చేతిలో చిత్రహింసలకు గురవుతున్న ఇద్దరు భారతీయ యువకులు
ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన భారతీయ యువకులు అక్కడ యజమానుల చేతిలో చిత్రహింసలకు గురవుతున్న ఘటన వెలుగులోకొచ్చింది. ఖతర్‌కు వెళ్లిన యూపీకి చెందిన పర్వేజ్ అహ్మద్ (24), మహ్మద్ అక్రమ్ (27) అనే ఇద్దరు యువకులను పైఅధికారి ఒకరు రక్తం వచ్చేలా కొట్టారు. యువకుల లోదుస్తులు విప్పించిన ఆ అధికారి గుర్రం పగ్గం తీసుకుని ఎడాపెడా బాదాడు. దీంతో వారి శరీరంపై తీవ్ర గాయాలు ఏర్పడ్డాయి. సదరు బాధితులు తమకు తగిలిన గాయాలను వీడియో తీసి పంపడంతో ఈ విషయం వెలుగులోకొచ్చింది. తమని ఆదుకోవాలని వారు అందులో కోరారు.
ఈ యువకులు నాలుగు నెలల క్రితం పుణెకు చెందిన ఓ ఏజెంట్ ద్వారా ఐదేళ్ల కాలపరిమితిపై డ్రైవర్లుగా పనిచేసేందుకు వీసా పొంది అక్కడకు వెళ్లారు. అయితే, వీరిద్దరినీ సౌదీ అరేబియా-ఖతర్ సరిహద్దున ఉన్న ఓ ఫామ్‌కు తీసుకెళ్లి అక్కడ పశువుల సంరక్షణకు పెట్టారు. అక్కడే తమ అధికారి తమను తీవ్రంగా వేధిస్తున్నాడని వారు చెప్పారు. ఢిల్లీలో ఉన్న తన స్నేహితుడు అఫ్తామ్కి పలు ఫొటోలను పంపుతూ, తమను తప్పుడు కేసులో ఇరికించే ప్రమాదం కూడా ఉందని వారు వాపోయారు. తమని ఎలాగైనా కాపాడాలని వేడుకుంటున్నారు.