: పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్, సౌదీ అరేబియాలకు మినహాయింపునిచ్చిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రధాన హామీల అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఒబామా హెల్త్ కేర్ ను సవరిస్తున్నట్టు ప్రకటించిన ఆయన, మెక్సికోకు అడ్డంగా గోడకడతామని ప్రకటించారు. తాజాగా ముస్లింలు అమెరికాలో అడుగుపెట్టడంపై నిషేధం విధించే దిశగా చర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఏడు దేశాలకు చెందిన ముస్లింలను అమెరికాలో అడుగుపెట్టనీయకుండా నిషేధం విధించనున్నట్టు తెలుస్తుండగా, ఆ జాబితాలో పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్, సౌదీఅరేబియా దేశాలకు మినహాయింపు లభించినట్టు సమాచారం. అయితే ఈ దేశాల నుంచి అమెరికా వచ్చేవారికి ప్రత్యేక తనిఖీలు ఉంటాయని ట్రంప్ ప్రకటించారు. ముస్లింలందర్నీ నిషేధించడం తన ఉద్దేశం కాదని, టెర్రరిజం ప్రభావం ఉండే దేశాలకు చెందిన వారిపై నిషేధం ఉంటుందని ఆయన చెప్పారు. ఇంత వరకు ఆ దేశాలకు చెందిన వారు తేలిగ్గా అమెరికాలో అడుగుపెట్టారని, ఇకపై అలా జరగదని, అమెరికాలో అడుగుపెట్టడం చాలా కష్టమని ఆయన స్పష్టం చేశారు.