: రెండు రాష్ట్రాలుగా విడిపోవడానికి కారణమే యువత... వారిని అడ్డగిస్తే పరిణామాలు తీవ్రంగా వుంటాయి!: పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోవడానికి కారణమే యువతని, ఇప్పుడు అదే యువత చేస్తున్న నిరసనలను అడ్డుకోవాలని చూస్తే, ప్రభుత్వాలకు పెను ప్రమాదం తప్పదని జనసేనాని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడుతూ, తమకు అన్యాయం జరిగిందని తెలంగాణ యువత గట్టిగా నమ్మి ఉద్యమించడంతోనే ప్రత్యేక రాష్ట్రం సాకారమైందని, అందుకోసం జరిగిన ఉద్యమంలో వందలాది మంది మరణించారని గుర్తు చేశారు. ఇప్పుడు అదే తరహా ఉద్యమ స్ఫూర్తి ఆంధ్రప్రదేశ్ యువతలో రగలకముందే ప్రభుత్వాలు మేలుకోవాలని సూచించారు. యువతను అడ్డగిస్తే, జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్న సంగతి ప్రభుత్వాలకు తెలుసునని, అంతవరకూ పరిస్థితి రాకూడదనే తాను కోరుకుంటున్నానని చెప్పారు. పార్లమెంటులో ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. యువత ఉద్యమాల కారణంగానే ఏపీ రెండుగా విడిపోయిందని గుర్తు చేస్తూ, తిరిగి అదే యువతలో ఉద్యమ స్ఫూర్తి రగిలితే, ఇప్పుడున్న ప్రశాంత పరిస్థితి మారుతుందని గుర్తుంచుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హితవు పలికారు.