: ట్రంప్ ఉంటే మరింత ముందుగా వినాశనం... డూమ్స్ డే క్లాక్ ను ముందుకు జరిపిన సైంటిస్టులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణంగా ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఊహిస్తున్న సమయం కన్నా, ముందే ప్రపంచ వినాశనం సంభవించనుందని భావిస్తూ, అటామిక్ సైంటిస్ట్స్ బులెటిన్ డూమ్స్ డే గడియారాన్ని మరో 30 సెకన్లు తగ్గించింది. ప్రపంచ నాశన సమయాన్ని ఈ గడియారం చూపుతుందన్న సంగతి తెలిసిందే. తమ సింబాలిక్ డూమ్స్ డే క్లాక్ ను అర్ధరాత్రికి రెండున్నర నిమిషాల ముందుకు మార్చారు.
1953 నుంచి డూమ్స్ డే సమయంతో పోలిస్తే, ఇది అతి దగ్గరి సమయం. ప్రపంచ వ్యాప్తంగా మానవత్వం నశిస్తుండటం, పెరిగిపోతున్న అణ్వాయుధాలు, వాతావరణ మార్పులు, ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన చేసిన వ్యాఖ్యలతో ప్రపంచ వినాశనం మరింత త్వరగా సంభవిస్తుందన్న ఆందోళన పెరిగిందని, 15 మంది నోబెల్ బహుమతి గ్రహీతలు ఉన్న అటామిక్ శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది.
కాగా, 1947లో ఈ గడియారం ఏర్పాటు కాగా, అర్థరాత్రికి ఎంత సమయం దగ్గరగా ఈ గడియారంలోని సమయం ఉంటే అంత తొందరగా వినాశనం ఏర్పడుతుందని అర్థం. 1953లో దీనిలోని సమయం అర్థరాత్రికి అత్యంత దగ్గరగా శాస్త్రవేత్తలు అమర్చగా, సోవియట్ యూనియన్ తొలి హైడ్రోజన్ బాంబును పేల్చి ఆధునిక ఆయుధాల తయారీ పోటీకి తెరలేపింది. ఇప్పటివరకూ ఈ గడియారంలోని సమయాన్ని 19 సార్లు సవరించారు. 1991లో అత్యంత దూరంగా రాత్రి 12 గంటల సమయానికి 17 నిమిషాల దూరంలో ఉంచారు. ప్రపంచంలో సంభవిస్తున్న రాజకీయ, సామాజిక, ప్రభుత్వ విధానాల మార్పులకు అనుగుణంగా సైంటిస్టుల బృందం దీన్ని సవరిస్తుంటుంది.