: ఏపీ పునర్విభజన చట్టంలో ఉన్నవే చెప్పారు.. మళ్లీ వాటికి చట్టబద్ధత కల్పించాలా?: ఉండవల్లి
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అంశాన్ని వదిలేసి, ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ విమర్శించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రత్యేక ప్యాకేజీ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఏపీ పునర్విభజన చట్టంలో ఉన్నవే చెప్పిందని అన్నారు. మళ్లీ వాటికి చట్టబద్ధత కల్పించాలా? అని ఉండవల్లి ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రాన్ని అయినా అసెంబ్లీ తీర్మానానికి వ్యతిరేకంగా విడదీశారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనే సరిగా జరగలేదని, ఇప్పుడు హోదా అంశాన్ని కూడా నీరుకార్చుతున్నారని ఆయన మండిపడ్డారు.
చంద్రబాబు నాయుడు మొన్నటి వరకు హైదరాబాద్‌ని తానే కట్టానని చెప్పారని, ఇప్పుడు హుద్‌హుద్‌లో విశాఖపట్నం కొట్టుకుపోతే అక్కడే కూర్చొని మళ్లీ కట్టించానని అంటున్నారని ఉండవల్లి అన్నారు. విశాఖపట్నాన్ని 8 రోజుల్లో మళ్లీ నిర్మించానని వ్యాఖ్యలు చేస్తూ ప్రజల్ని మభ్య పెడుతున్నారని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అంతా బోగస్ అని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఉద్ఘాటించారు.