: ఉంటే ఉంటా, పోతే పోతా... కుటుంబాన్ని, పిల్లల్ని వదిలి బయటకు వచ్చేందుకు సిద్ధం: పవన్ తుది హెచ్చరిక
ప్రజా ఉద్యమాలను పోలీసుల సహాయంతో అణగదొక్కాలని చూస్తే, ఎంతో కాలం పదవిలో ఉండలేరని జనసేనాని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. "మీ పాలసీలపై ప్రజలకు కమ్యూనికేట్ చేయాలిగానీ, పోలీసుల ద్వారా ప్రజలను కంట్రోల్ చేయాలని చూస్తే, అది పోస్ట్ పోన్ చేసినట్టే అవుతుంది కానీ ఇంకేం ప్రయోజనం ఉండదు. మీరు ఏమైనా చేస్తాం, మేం అధికారంలో ఉన్నాం అని మాట్లాడితే... నేను కేంద్ర ప్రభుత్వానికి గానీ, మిగతా నాయకులకు గానీ ఒకటే చెబుతూ ఉన్నా ప్రజల తరఫున... మేం కూడా ఉంటే ఉంటాం... పోతే పోతాం అన్న స్థాయికి వస్తాం. అప్పుడు... నేను వ్యక్తిగతంగా చెబుతున్నాను. నాకు కుటుంబం ఉంది, పిల్లలున్నారు. నా కెరీర్ ఉంది. వీటన్నింటినీ వదులుకుని గొడవ చేయగలను. అన్నింటికీ సిద్ధపడే పాలిటిక్స్ లోకి వచ్చాను" అని పవన్ మోదీ, చంద్రబాబు ప్రభుత్వాలకు తన వైపు నుంచి తుది హెచ్చరికలు జారీ చేశారు.
దయచేసి తన మాటలు మరచిపోవద్దని పవన్ హితవు పలికారు. అసలు రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇస్తారా? ఇవ్వరా? అన్న విషయం పక్కన పెడితే, ఇన్ని రకాల మాటలు మార్చినందుకు ప్రజలు అసహ్యించుకుంటున్నారని నిప్పులు చెరిగారు. ఒకసారి ఇస్తామని, ఐదేళ్లని, పదేళ్లని, పదిహేనేళ్లని... మరోసారి ఇవ్వమని, ఇంకోసారి ప్యాకేజీ అని అంటున్నారని ఎద్దేవా చేస్తూ, ప్రభుత్వాల్లోనే ఏదో తప్పుందని, అందువల్లే ఇలా చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.
స్పెషల్ ప్యాకేజీ సరైనది కాదని, ఈ విషయం తాను ఢిల్లీకి వెళ్లి స్వయంగా తెలుసుకున్నానని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును కేవలం వ్యవసాయ అవసరాలకు మాత్రమే అనుమతిచ్చారని, ఈ విషయంలో తన ప్రశ్నలకు ఇంతవరకూ చంద్రబాబు సమాధానం చెప్పలేదని పవన్ అన్నారు. ప్రజలకు న్యాయం చేయలేకపోయిన ఈ ప్రభుత్వాలు ఎందుకని అడిగారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం మీ నిర్ణయాలను ప్రజలపై రుద్దాలని భావిస్తే మాత్రం ప్రజల నుంచి నిరసనలు వస్తాయన్న విషయం మరవద్దని అన్నారు.