: పవన్ కల్యాణ్ అంటే మాకు అపారమైన గౌరవం ఉంది: టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు
జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ అంటే తమకు అపారమైన గౌరవం ఉందని టీడీపీ సీనియర్ నేత, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఈ రోజు పవన్ కల్యాణ్ టీడీపీ ప్రభుత్వంపై చేసిన విమర్శల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... పవన్ సూచనలన్నింటినీ తాము సానుకూలంగానే తీసుకుంటున్నామని అన్నారు. అయితే, పవన్ కల్యాణ్ చేసిన పలు వ్యాఖ్యలు సరైనవి కాదని అన్నారు. బ్యాంకులకు సుజనా చౌదరి డబ్బు ఎగ్గొట్టలేదని అన్నారు. సుజనా చౌదరి పందుల పందేలని వ్యాఖ్యలు చేయడం మాత్రం తప్పేనని తాము ఒప్పుకుంటున్నట్లు తెలిపారు.
ఉద్ధానంతో పాటు రైతుల సమస్యలను పవన్ తమ దృష్టికి తీసుకొచ్చారని, వాటిని ప్రభుత్వం పరిష్కరిస్తోందని ఉమా చెప్పారు. చంద్రబాబు లాంటి సమర్థవంతమైన నాయకుడు ఆంధ్రప్రదేశ్‌కి ఉన్నారని, రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో 40 ఏళ్ల నుంచి లేని పురోగతిని రెండున్నరేళ్లలో తీసుకొచ్చామని అన్నారు. జనసేనతో మిత్ర బంధం, మిత్ర భేదం అనే పదాలు ఇప్పుడు ఉపయోగించడం సరికాదని అన్నారు.