: ఓట్ల కోసం నన్ను తెలంగాణ అంతటా తిప్పారు... నాడు రాజకీయ అనుభవం గురించి అడిగారా?: పవన్ నిప్పులు
బీజేపీకి తాను మద్దతిస్తున్న వేళ, తనకు రాజకీయ అనుభవం ఉందా? అన్న ప్రశ్న తలెత్తలేదని, ఆనాడు ఈ ప్రశ్నను సిద్ధార్థ నాథ్ సింగ్ అడగలేదని పవన్ చెప్పారు. ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు తనను తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతాలకు తిప్పారని, బతిమిలాడి తెలంగాణ అంతటా పర్యటనలకు పంపారని పవన్ గుర్తు చేశారు. ఆనాడు ప్రచారానికి అవసరం లేని రాజకీయ అనుభవం నేడెందుకని పవన్ ప్రశ్నలు సంధించారు.
ఈ రోజు ప్రత్యేక హోదా గురించి అడిగితే, తనకు రాజకీయాలపై ఏబీసీడీలు తెలియవని, నేర్చుకుని రమ్మంటున్నారని, ఇంతకు మించిన అవకాశవాదం ఇంకేముంటుందని అడిగారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయిందని, ఈ మూడేళ్ల కాలంలో తాను ప్రభుత్వాలను ఎన్నడూ ఇబ్బందులు పెట్టలేదని పవన్ కల్యాణ్ తెలిపారు. అన్నీ రూల్ బుక్ ప్రకారం జరగాలంటే కుదరదన్న సంగతి తనకు తెలుసునని, అందుకే తగినంత సమయం ఇవ్వాలని భావించినట్టు తెలిపారు. పవన్ మీడియా సమావేశం వాడివేడిగా సాగుతోంది.