: వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా జగన్‌లా ఎప్పుడూ దిగజారి మాట్లాడలేదు: చంద్రబాబు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా ఎప్పుడూ జగన్‌లా దిగజారి మాట్లాడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. గణతంత్ర దినోత్సవం రోజు విశాఖలో జగన్ హల్‌చల్ చేయడంపై స్పందించిన సీఎం మాట్లాడుతూ జగన్ పులివెందుల నుంచి వ్యక్తిగత రక్షణ సిబ్బందిని తెప్పించుకున్నారని అన్నారు. అధికార దాహంతో తపించిపోతున్న జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. పులివెందులకు సాగునీరు ఇస్తామన్నా అడ్డుకునే స్థాయికి ఆయన దిగజారిపోయారన్నారు. ముఖ్యమంత్రిని చెప్పుతో కొట్టండని చెప్పడం ఒక్క జగన్‌కే చెల్లిందన్నారు. తాను చెన్నారెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, వైఎస్ రాజశేఖరరెడ్డి వంటి వారితో పోరాడానని, కానీ వారెవరూ జగన్‌లా దిగజారి మాట్లాడలేదని అన్నారు. జగన్‌లాంటి వారి ఉచ్చులో పడకుండా యువత, ప్రజలు సంయమనంతో ఆలోచించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.