: టీడీపీ ప్రభుత్వం పెడుతున్న కేసులకు ఎవరూ భయపడద్దు.. మన ప్రభుత్వం వచ్చాక ప్రతి కేసూ తీసేస్తా!: జగన్


రాజ్యాంగం అమలులోకి వచ్చి 68 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని వైఎస్సార్సీపీ అధినేత జగన్ వ్యాఖ్యానించారు. హైదరాబాదులో లోటస్ పాండ్ లో ఆయన మాట్లాడుతూ, గాంధేయ పధ్ధతిలో శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే, కాకినాడలో జేఎన్టీయూ, తిరుపతి ఎస్వీయూ, వైజాగ్ ఏయూ పిల్లల్ని కొట్టడం, వైఎస్సార్సీపీ నేతలను హౌస్ అరెస్టు చేయడం, పోలీస్ స్టేషన్లకు తీసుకుపోవడం, కమ్యూనిస్టుపార్టీ నేత మధన్నను దారుణంగా అరెస్టు చేయడం బాధాకరమని అన్నారు. తాము ఎయిర్ పోర్టులో విమానం దిగ్గానే, రన్ వే మీదనే తమ ఆరుగుర్ని వందలకొద్దీ పోలీసులతో ఎయిర్ పోర్టులోకి ఎంటర్ కూడా కానీయకుండా ఆపడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.

ప్రతిపక్ష నేత, ఒక ఎంపీ, మరొక ఎక్స్ ఎమ్మెల్యే అని కూడా చూడకుండా గేటు లోపలికి కూడా ఎంటర్ కానీయకుండా చూడడం సరైనదేనా? అని ఆయన అడిగారు. ఎయిర్ పోర్టులో స్టేట్ గవర్నమెంట్ పోలీసులకు అధికారం లేకున్నా వారిని మోహరించడం, ప్యాసింజర్లైన తమను రెండు గంటలపాటు డొమెస్టిక్ అరైవల్ గేట్ దగ్గర ఆపడం సరైన పనేనా? అని నిలదీశారు. దీంతో తాము తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడే ధర్నాకు కూర్చోవాల్సి వచ్చిందని వాపోయారు. చంద్రబాబు సర్కార్, ఆ సర్కార్ లోని పోలీసులు తెలుసుకోవాల్సింది ఒక్కటేనని అన్నారు. పోలీసులకు జీతాలిచ్చేది చంద్రబాబు కాదని, ప్రభుత్వమని తెలిపారు. పోలీసులు తమ టోపీలో ధరించిన నాలుగు సింహాలకు సెల్యూట్ చేయాలి కానీ, దాని వెనుకున్న గుంటనక్కలకు కాదని ఆయన తెలిపారు.

తాము చేస్తున్నది రాష్ట్ర భవిష్యత్ పోరాటమని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్ అంటే అందులో పోలీసుల పిల్లల భవిష్యత్ కూడా ఉంటుందన్న సంగతి తెలుసుకోవాలని ఆయన సూచించారు. ఎయిర్ పోర్టులో స్టేట్ పోలీసులుండడం, ఎయిర్ పోర్టులో ప్యాసింజర్ హక్కులను హరించడంపై ఎంక్వయరీలు జరుగుతాయని ఆయన చెప్పారు. దీనికి బాధ్యులపై సమయం వచ్చినప్పుడు చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం పెడుతున్న కేసులకు ఎవరూ భయపడొద్దని ఆయన అన్నారు. దేవుడు దయతలిస్తే ఏడాదిలో చంద్రబాబు సర్కార్ పోతుందని తెలిపారు. లేదా రెండేళ్లలో అది పోయి, తమ ప్రభుత్వం వస్తుందని చెప్పారు. అప్పుడు చంద్రబాబు పెట్టిన ప్రతి కేసూ తీసేస్తానని ఆయన ప్రకటించారు.

రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాలరాస్తున్న చంద్రబాబును దేవుడు, ప్రజలు క్షమించరని అన్నారు. ప్రజలు బంగాళాఖాతంలో విసిరికొడతారని ఆయన హెచ్చరించారు. బాబు వైఖరికి నిరసనగా, హోదాకు మద్దతుగా రేపు ఆందోళనలు చేయాల్సిందిగా అందర్నీ కోరుతున్నానని ఆయన పిలుపునిచ్చారు. ప్రత్యేకహోదాపై ఆందోళన చేయకపోతే దానిని చంద్రబాబు మర్చిపోయేలా చేస్తారని ఆయన అన్నారు. హోదా కోసం అందరం కలిసికట్టుగా ఉందామని ఆయన తెలిపారు. హోదా కోసం అందరం ఒక్కటవ్వుదామని ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబును గట్టిగా ఎదుర్కొందామని అన్నారు.

ప్రత్యేకహోదాను అందరం కలిసికట్టుగా ఒక్కటై సాధించుకుందామని ఆయన సూచించారు. చంద్రబాబు, మంత్రులు వెటకారంగా మాట్లాడుతున్న జల్లికట్టు వ్యవహారంలో తమిళుల ఐకమత్యానికి తాము ముగ్ధులమయ్యామని ఆయన చెప్పారు. సుప్రీంకోర్టు వ్యతిరేకించినా పోరాడి సాధించుకున్నారని ఆయన గుర్తు చేశారు. అలాంటి జల్లికట్టు, తెలంగాణ ఉద్యమాల స్పూర్తిగా ప్రత్యేకహోదా సాధించుకుందామని ఆయన పిలుపునిచ్చారు.  

  • Loading...

More Telugu News