: జగన్ తో పోలీస్ కమీషనర్ చర్చలు... ఎయిర్ పోర్టు బయట ఉద్రిక్తత!
విశాఖపట్టణం ఎయిర్ పోర్టు బయట ఉద్రిక్తత నెలకొంది. నేటి సాయంత్రం విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న వైఎస్సార్సీపీ అధినేత జగన్ ను పోలీసులు సుమారు రెండు గంటల నుంచి నిర్బంధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను రన్ వే నుంచి వీఐపీ లాంజ్ కు తరలించారు. కాసేపటి క్రితం రంగప్రవేశం చేసిన వైజాగ్ పోలీస్ కమిషనర్ యోగానంద్ జగన్ తో సంప్రదింపులు జరుపుతున్నారు . వైజాగ్ నుంచి హైదరాబాదుకు బయల్దేరనున్న ఎయిర్ ఇండియా విమానంలో ఆయనను వెనక్కి తిప్పి పంపే అవకాశం ఉందని తెలుస్తోంది. జగన్ ను తిప్పి పంపనున్నారన్న వార్తలతో ఎయిర్ పోర్టు బయట ఉన్న ఆయన మద్దతుదారులు ఎయిర్ పోర్టులోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ వైఎస్సార్సీపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.