: నీకేమన్నా బుద్ధుందా?..ఏం చేస్తున్నావో తెలుస్తోందా?: పోలీసు అధికారిపై జగన్ ఫైర్
నీకేమన్నా బుద్ధుందా? ఏం చేస్తున్నావో తెలుస్తోందా? అంటూ పోలీసు అధికారిపై వైఎస్సార్సీపీ అధినేత జగన్ మండిపడ్డారు. ప్రత్యేకహోదాపై వైజాగ్ లోని ఆర్కేబీచ్ లో జరగనున్న కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేందుకు హైదరాబాదు నుంచి వైజాగ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న జగన్ ను రన్ వేపై పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను, ఆయనతో పాటు వచ్చిన వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా పోలీసులపై జగన్ మండిపడ్డారు. అరైవల్ లాంజ్ లోకి ప్రవేశించకుండా డోర్ ఎందుకు లాక్ చేశారంటూ ప్రశ్నించారు. ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియదా? అసలు పోలీసువెలా అయ్యావు? నీకేమన్నా బుద్ధుందా? అసలు ఏం చేస్తున్నావో తెలుస్తోందా? అని పోలీసు అధికారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చి సర్ది చెబుతున్న మరో పోలీసు అధికారిని ఉద్దేశించి, 'ఐడీ కార్డు కూడా లేకుండా డిపార్ట్ మెంట్ అని ఎలా చెబుతున్నావు?' అంటూ మండిపడ్డారు. అనంతరం జగన్ రన్ వే పై బైఠాయించారు.