: నాది తెలంగాణ.. అయినప్పటికీ ఏపీకి ప్రత్యేక హోదాకు నా పూర్తి మద్దతు: సంపూర్ణేష్ బాబు
ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమానికి తన మద్దతు పూర్తిగా ఉంటుందని సినీనటుడు సంపూర్ణేష్ బాబు అన్నారు. ఈ రోజు విశాఖపట్నంలో నిర్వహించతలపెట్టిన ప్రత్యేక హోదా ఉద్యమం నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తాను తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాడినని, అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ప్రత్యేక హోదా పోరాటానికి మద్దతు ఇస్తున్నానని చెప్పారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని, తెలుగువారంతా సంతోషంగా ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యేక ప్యాకేజీపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన... హోదా అనేది స్థాయిని చూపించేది కాబట్టి అదే కావాలని రాష్ట్ర యువత పోరాడుతున్నారని చెప్పారు. గణతంత్ర దినోత్సవాన కూడా ప్రజలను బయటకు రానివ్వడం లేదని ఆయన అన్నారు.
ప్రత్యేక హోదా ఉద్యమానికి సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించాయి.