: గోడ నువ్వే కట్టుకో... ఒక్క పైసా ఇచ్చేది లేదు: తెగేసి చెప్పిన మెక్సికో
తమ సరిహద్దులో కట్టే ఎలాంటి గోడలకూ తాము ఒక్క పైసా కూడా ఇచ్చేది లేదని మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నిటో తెగేసి చెప్పారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో వీడియో ప్రకటనను ఆయన ఉంచారు. మెక్సికో సరిహద్దులో గోడ కట్టేందుకు నిర్ణయించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అందుకు సంబంధించిన దస్త్రాలపై సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. ఆపై స్పందించిన ఎన్రిక్, "గోడలతో ప్రయోజనం ఉంటుందని మెక్సికో నమ్మడం లేదు. మరోసారి చెబుతున్నా. మెక్సికో ఎలాంటి గోడల నిర్మాణం నిమిత్తం డబ్బు చెల్లించదు" అని స్పష్టం చేశారు. కాగా, మెక్సికో సరిహద్దుల్లో కట్టే గోడకు ఆ దేశం నిధులిస్తుందని గతంలో ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తొలుత తాము డబ్బు పెట్టి గోడను కడతామని, ఆపై మెక్సికో ఆ నిధులను రీయింబర్స్ చేస్తుందని ఏబీసీ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ నెల 31న మెక్సికో అధ్యక్షుడి యూఎస్ పర్యటన ఖరారు కావడంతో, గోడ విషయమై తుది నిర్ణయం నెలాఖరులో వెల్లడవుతుందని అంచనా.