: అసోంలో విరుచుకుపడ్డ ఉగ్రవాదులు... రెండు చోట్ల పేలుళ్లు
దేశవ్యాప్తంగా రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్న వేళ, అసోంలో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ ఉదయం చౌరాడియోలోని పానిజాన్ ప్రాంతంలో రెండు చోట్ల శక్తిమంతమైన బాంబులు పేల్చారు. తొలుత ఓ పెట్రోలు బంకు వద్ద, కాసేపటికి అక్కడికి సమీపంలోని లెంగిబోర్ వద్ద ఐఈడీ బాంబులను పేల్చారని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ దాడులను తామే చేశామని యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం వెల్లడించింది. మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరించింది. కాగా, ఈ పేలుళ్లతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కాగా, గత సంవత్సరం నవంబరులో ఇదే ఉగ్రవాద సంస్థ దిగ్బోయ్ సమీపంలో ఆర్మీ కాన్వాయ్ పై దాడి జరుపగా, ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.