: గణతంత్ర దినోత్సవం రోజున నల్లబ్యాడ్జీలు తగిలించాలన్న ఆలోచన మనసున్న వాడికి వస్తుందా?: జగన్‌పై చంద్రబాబు నిప్పులు
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మండిపడ్డారు. రోజుకో వేషంతో ప్రజలను మభ్యపెట్టేందుకు వస్తున్నారంటూ విమర్శించారు. పోలవరం పూర్తయితే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని భావిస్తున్న కొందరు హోదా పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని, రోజుకో వేషంతో వస్తున్నారని పరోక్షంగా జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేశమంతా గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న వేళ ఎవరైనా ఆందోళనకు దిగుతారా? అని ప్రశ్నించారు.
ఏపీని అభివృద్ధి చేసేందుకు తాను అహర్నిశలు కష్టపడుతున్నానని, ఈ విషయాన్ని గర్వంగా చెప్పుకోగలనని అన్నారు. రాజకీయ దురుద్దేశంతో వ్యవహరించేవారితో తాను పోరాడలేనని అన్నారు. ప్రజలే వారితో పోరాడి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. పెట్టబడిదారుల సదస్సుకు 42 దేశాల ప్రతినిధులు హాజరవుతుంటే కాగడాలు వెలిగించి రాష్ట్రంలో అశాంతి, అల్లకల్లోలం ఉందని చెబుతారా? అని మండిపడ్డారు. అసలు గణతంత్ర దినోత్సవం రోజున నల్ల బ్యాడ్జీలు తగిలించాలన్న ఆలోచన మనసున్న ఎవరికైనా వస్తుందా? అని చంద్రబాబు ప్రశ్నించారు.