: విశాఖలో టెన్షన్.. టెన్షన్.. ఖాకీల పహారా మధ్య స్టీల్ సిటీ!
విశాఖపట్నంలో ఇప్పుడు ఒకటే టెన్షన్. ఈ రోజు ఏం జరగబోతోంది? అనే ప్రశ్న అందరినీ వేధిస్తోంది. తీర నగరాన్ని ఇప్పటికే ఖాకీలు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఓవైపు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సు. మరోవైపు ప్రజల భావోద్వేగంతో ముడిపడిన ప్రత్యేక హోదా నిరసన. దీంతో స్టీల్ సిటీలో కనిపించని ఉద్రిక్తత నెలకొంది. భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు వేలాదిమంది వస్తున్నారు. అదే సమయంలో ప్రత్యేక హోదాను కోరుతూ నిరసన తెలిపేందుకు బీచ్ రోడ్డుకు ప్రజలు పోటెత్తనున్నారు. ప్రజల మౌన ప్రదర్శనకు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దీనికి మద్దతు తెలుపుతూ నిరసనలో పాల్గొననున్నారు. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా రోడ్లపై బలగాలను మోహరించారు. మొత్తంగా గురువారం ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ పలు కార్యక్రమాలు జరగనున్నాయి. వైసీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ బీచ్‌లో నిర్వహించనున్న కొవ్వొత్తుల ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. మౌన ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరుతూ జనసేన కార్యకర్తలు ఇప్పటికే పలు కాలేజీలకు వెళ్లి విద్యార్థులను కోరారు. అలాగే ‘ఆంధ్ర యువత’ ఆధ్వర్యంలో జిల్లా కోర్టుకు వెళ్లి న్యాయవాదుల మద్దతు కోరారు. వీరికి సీపీఎం, సీపీఐ సహా పలు విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి.
మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ వస్తారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి విశాఖకు దారితీసే రోడ్లపై విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకోవాలా? వద్దా? అనే విషయంలో పోలీసు అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.