: ‘డోపింగ్’లో దొరికిన సహచర అథ్లెట్.. పతకం కోల్పోయిన జమైకా చిరుత బోల్ట్!
డోపింగ్ టెస్టులో సహచర అథ్లెట్ నెస్టా కార్టర్ దొరకడంతో .. జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ పతకం కోల్పోయాడు. 2008 బీజింగ్ ఒలింపిక్ గేమ్స్ లో జమైకా తరపున 4x100 రిలే పోటీలో బోల్ట్ తో పాటు మరో అథ్లెట్ కార్టర్ కూడా పాల్గొన్నాడు. అయితే, కార్టర్ కు సంబంధించిన మూత్ర, రక్త నమూనాలను మరోసారి పరీక్షించగా, అతడు నిషేధిత ఉత్ప్రేరకాలను వాడినట్లు తేలింది. దీంతో, ఆ జట్టు మొత్తానికి ఆ పతకాన్ని రద్దు చేస్తున్నట్లు ఒలింపిక్ అధికారులు ప్రకటించారు. ఈ ప్రకటనతో బోల్ట్ సహా నలుగురు అథ్లెట్లు ఆ పతకాన్ని పోగొట్టుకున్నట్టయింది. కాగా, 100 మీటర్ల పరుగులో అత్యంత వేగంగా పరిగెత్తే అథ్లెట్లలో ఆరో వాడు కార్టర్. బీజింగ్ లో జరిగిన 4x100 రిలే పోటీలో నలుగురిలో మొదటగా పరిగెత్తాడు. ఈ రేసును 37.10 సెకండ్లలో ఆ జట్టు పూర్తి చేసి నాడు ప్రపంచ రికార్డు సృష్టించింది.