: అమ్మ కష్టాన్ని చూసి చలించిపోయాడు.. చేనేత యంత్రాన్ని కనిపెట్టాడు.. ఇప్పుడు 'పద్మశ్రీ' అయ్యాడు!
చేనేత బట్టలు వడుకుతూ తన తల్లి పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయాడు. చేనేత కార్మికులు అనుభవిస్తోన్న బాధలని తీర్చాలని కంకణం కట్టుకున్నాడు. చివరకి అనుకున్నది సాధించి చేనేతకు సంబంధించిన యంత్రాన్ని కనుగొని వారు పడుతున్న కష్టాలను కాస్తయినా తీర్చడానికి కృషి చేశాడు. ఇంతటి కృషిచేసిన స్కూల్ డ్రాపౌట్ చింతకింది మల్లేశంను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇస్తున్నట్లు ఈ రోజు ప్రకటించింది. చింతకింది మల్లేశం యాదాద్రి జిల్లా ఆలేరుకు చెందిన వ్యక్తి. మగ్గాలపై పనులు చేస్తుండగా చేతులు లాగినా అదేపనిగా తన తల్లితో పాటు తన ఇంటి సమీపంలోనే ఉండే కార్మికులు పడుతున్న కష్టాలను చూసిన ఆయన ఆ యంత్రాన్ని కనిపెట్టాడు.
తాను కనిపెట్టిన ఈ యంత్రానికి తన తల్లిపేరు కలిసి వచ్చేలా లక్ష్మీ ఆసుయత్రం అనే పేరు పెట్టాడు. జిల్లాలోని ఆలేరు మండలం శారాజీపేట అనే మారుమూల గ్రామీణ చేనేత కార్మికుడైన మల్లేశం సుమారు 17 సంవత్సరాల క్రితం అంటే 2000వ సంవత్సరంలో ఈ యంత్రాన్ని కనిపెట్టాడు. రెండు తక్కువ కెపాసిటీ గల మోటర్లను వుడ్ ఫ్రేమ్ తో తయారు చేసిన ఈ యంత్రం కోసం వాడాడు.
చేనేత కార్మికులు శారీరక శ్రమ లేకుండా దీంతో చీరలు నేయవచ్చు. తమ పాత పద్ధతుల్లో రోజు రెండు చీరలు మాత్రమే నేసేవారు ఇప్పుడు ఈ యంత్రంతో రోజుకు ఆరు నుంచి ఏడు చీరల వరకు నేస్తున్నారు. 2011 సంవత్సరంలో ఈ యంత్రానికి పేటెంట్ హక్కులు వచ్చాయి. మల్లేశం పేరు అదే సంవత్సరం చివర్లో ఫోర్బ్స్ జాబితాలోనూ కనపడింది. అదే ఏడాది ఆసుయంత్రానికి సాఫ్ట్ వేర్ జత చేస్తామని అమెరికా తెలిపింది. చేనేత కుటుంబాలన్నింటికీ ఈ లక్ష్మీ ఆసుయంత్రాన్ని సరఫరా చేయాలన్నదే ఆయన ఆకాంక్ష. గతంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో పాటు ప్రతిభాపాటిల్ చేతుల మీదుగా ఆయన పలు అవార్డులు అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన ఆలేరులో చేనేత వృత్తిలో కొనసాగుతూ ఆలేరు మండల సిల్క్ సొసైటీకి అధ్యక్షుడిగా పనిచేస్తూ తన ప్రయత్నాల్ని కొనసాగిస్తున్నాడు.