: మొక్కలు నాటుతాడు.. నాటండంటూ మొక్కుతాడు.. మొక్కల నేస్తంకు పద్మశ్రీ!
మొక్కలు నాటడమే జీవిత పరమార్థంగా చేసుకున్న ఖమ్మం జిల్లాలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన దరిపల్లి రామయ్యకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. ఇప్పటికి సుమారు కోటి మొక్కలు నాటిన ఈ నిరుపేదను అందరూ వనజీవి రామయ్యగా పిలుచుకుంటారు. పచ్చదనమే ప్రాణంగా, పర్యావరణ రక్షణే ధ్యేయంగా ఆయన చేసిన అలుపెరుగని శ్రమకు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం సముచితమైన పురస్కారాన్ని ప్రకటించింది.
కనీసం ఒక్క మొక్క నాటమన్నా మనకెందుకులే అనుకొని వదిలేసే జనాలు ఉన్న సమాజంలో ఏకంగా కోటి మొక్కలను నాటడం అంటే మాటలు కాదు. పర్యావరణ రక్షణపై ఆయనకు ఉన్న అవగాహన అద్భుతమని చెప్పుకోవచ్చు. ఎవరికీ తెలియని చెట్ల పేర్లు, ఎవరూ చూడని విత్తనాలు సేకరించి బస్తాల్లో నింపి నిల్వ చేసేవాడు. రోడ్లకు ఇరువైపులా, చెరవు కట్టల వెంట, ఖాళీ స్థలాల్లో, పాఠశాలల్లో ఒక్కటేమిటీ తనకు ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ విత్తనాలు, మొక్కలు నాటే వాడు ఈ వనజీవి.
కేవలం మొక్కలను నాటడమే కాదు. వృక్షోరక్షతి.. రక్షితః అని రాసిన అట్ట ముక్కలు తలకు, సైకిల్‌కు తగిలించుకుని మొక్కలను నాటాలంటూ, చెట్లను పెంచాలంటూ రామయ్య ప్రచారం చేస్తూ ఉంటాడు. ఇప్పటికే రాష్ట్ర, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్ తో పాటు ప్రధానమంత్రి చేతుల మీదుగా కూడా రామయ్య పురస్కారాలు అందుకున్నాడు. 1995లో కేంద్రం నుంచి ఆయనకు వనసేవా అవార్డు లభించింది. అంతేకాదు యూనివర్సల్ గ్లోబల్ పీస్ అనే అంతర్జాతీయ స్వచ్చంద సంస్థ ఆయన చేస్తోన్న కృషిని గుర్తించి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.