: జైలులో కొట్టుకున్న రెండు గ్రూపులు... ఒక ఖైదీ మృతి
జైలులో రెండు గ్రూపుల మధ్య గొడవ చెలరేగి ఒకరిపై ఒకరు దాడులకు దిగడంతో ఒక ఖైదీ మృతి చెందిన ఘటన గోవాలోని పంజీకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న సదా సబ్ జైలులో చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరి కొంతమందికి గాయాలయ్యాయి. నిన్న రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనపై డీఎస్పీ లారెన్స్ డి సౌజా ఈ రోజు వివరాలు తెలిపారు. మృతి చెందిన ఖైదీ పేరు వినాయక్ కోర్బాట్కర్ అని చెప్పారు. అయనపై కత్తితో దాడి జరిగిన అనంతరం వెంటనే ఆసుపత్రికి తరలించామని, అయితే ఆ ఖైదీ అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు చెప్పారని అన్నారు. ఈ నెలలోనే మరో ఖైదీ అశ్పక్ బెనర్జీపై కత్తితో దాడి జరిగిందని, ఆ ఘటనలో వినాయక్ ప్రమేయం ఉందని అన్నారు.
పంజీకి 15 కిలోమీటర్ల దూరంలో కొత్తగా నిర్మించిన కొల్వాలే సెంట్రల్ జైలులోకి ఈ ఖైదీలను తీసుకెళుతుండగా ఖైదీల మధ్య ఈ గొడవ చెలరేగిందని చెప్పారు. ఈ సమయంలో ఖైదీలు జైలు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారని, ఈ క్రమంలో జైలు సిబ్బందిపై కూడా ఖైదీలు దాడికి దిగారని చెప్పారు. మెయిన్ గేట్ ద్వారా ఖైదీలు పారిపోతుండగా అక్కడ ఉన్న పోలీసులు ఖైదీలను అడ్డుకున్నారని చెప్పారు. కొన్ని గంటల తరువాత పరిస్థితి అదుపులోకి వచ్చిందని అన్నారు.