: ఓటర్లకు వల.. అమెరికా, కెనడా దేశాల్లో భూములిస్తామంటున్న ‘అకాలీదళ్’!
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో ఆయా పార్టీల ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు ఆయా పార్టీల నేతలు వాగ్దానాలు, హామీలు గుప్పిస్తున్నారు. అయితే, ఈ విషయంలో శిరోమణి అకాలీదళ్ పార్టీ మాత్రం ఇంతవరకూ ఏ పార్టీ ఇవ్వని హామీని ఇచ్చింది. అమెరికా, కెనడా వంటి దేశాలకు వలస వెళ్లి ఫ్రొపెషనల్ రైతులుగా మారేందుకు ముందుకొచ్చే వారి కోసం దాదాపు ఒక లక్ష ఎకరాలను ఆయా చోట్ల కొనుగోలు చేస్తామని, అక్కడకు వెళ్లి ఎంచక్కా సెటిల్ అయిపోవచ్చని చెబుతోంది. అకాలీదళ్ నేతలు ఈ హామీని తమ మ్యానిఫెస్టోలో అయితే పొందుపరిచారు కానీ, దీనికి ఎవరు అర్హులు? ఏ విధంగా అమలు చేస్తామనే వివరాలు మాత్రం ప్రకటించకపోవడం గమనార్హం.