: ట్రంప్ అన్నంత పనీ చేసేస్తున్నారు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేస్తున్నారు. అధ్యక్ష ఎన్నికలకు ముందు ఆయన ఏవైతే చెప్పారో అవన్నీ అమలు చేసే తీరుతానన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఒబామా హెల్త్ స్కీమ్ ను రద్దు చేసిన ట్రంప్, త్వరలో మెక్సికోకు అడ్డుగోడకట్టే ఫైలుపై నేడు సంతకం చేయనున్నారు. యూఎస్-మెక్సికో మధ్య 3,201 కిలోమీటర్ల సుదీర్ఘ సరిహద్దు ఉంది. ప్రస్తుతానికి ఈ రెండు దేశాల మధ్యనున్న సరిహద్దులో 1050 కిలోమీటర్ల మేర ఇనుప కంచె ఉంది.

2006లో ఈ రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో గోడకట్టే బిల్లు ఆమోదం పొందింది. దీంతో అప్పట్లో కొంత మేర గోడ నిర్మాణం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ట్రంప్ నేడు ఈ గోడ నిర్మాణం ఫైలుపై సంతకం చేయనున్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, జాతీయ భద్రతకు సంబంధించిన కీలక నిర్ణయానికి రంగం సిద్ధమైంది. 'అవును.. యూఎస్-మెక్సికో మధ్య గోడకట్టనున్నాము' అని ట్వీట్ చేశారు. నేడు ఆయన ఆ ఫైలుపై సంతకం చేయనున్నారు. దీంతో మిగిలిన భాగంలో గోడ నిర్మించనున్నారు. దీంతో డ్రగ్, మాఫియా కార్యకలాపాలు తగ్గుతాయని అమెరికన్లు భావిస్తున్నారు. 

More Telugu News