: ఉత్తమ్ కుమార్ రెడ్డి జీవితాంతం గడ్డంతో ఉండాల్సిందే: కర్నె ప్రభాకర్


కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు గడ్డం తీయబోనని చెబుతున్న తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ కుమార్ రెడ్డి జీవితాంతం ఆయన గడ్డంతో ఉండాల్సిందేనని, ఎన్నికల తర్వాత ఆయన హిమాలయాలకు వెళ్లాల్సిన పరిస్థితి రావొచ్చని టీఆర్ఎస్ నేత కర్నె ప్రభాకర్ ఎద్దేవా చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిపై నిప్పులు చెరిగిన ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణను ఎండబెట్టారని విమర్శించారు.

అధికారం లేకపోయేసరికి, గ్రామాల్లో తిరుగుతూ తెలంగాణ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు ప్రాధాన్యమున్న అంశాలను అసెంబ్లీలో చర్చించలేదని ఉత్తమ్ పేర్కొనడం ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమన్నారు. పేదల గృహ రుణాలు మాఫీ చేయడం, మైనార్టీలకు చేయూత నివ్వడం, రైతులకు భరోసా ఇవ్వడం వంటి అంశాలపై చర్చ జరిగిందని, ఇవన్నీ ముఖ్యమైన అంశాలు కాదా? అని కర్నె ప్రభాకర్ ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News