: అది ఏదైనా సరే, మీ పని మీరు చేయండి.. సక్సెస్ అవుతారు!: జాకీచాన్
ప్రముఖ హాలీవుడ్ నటుడు జాకీచాన్ 'కింగ్ ఫూ యోగా' చిత్రం ప్రమోషన్ సందర్భంగా కోట్లాదిమంది భారతీయుల మనసులు గెలుచుకున్నారు. సుదీర్ఘ నటనానుభవం ఉన్న జాకీచాన్ కు ఆస్కార్ రావడం పట్ల స్పందనను కోరగా, బాగుందని అన్నారు. ఆస్కార్ అవార్డు కోసం ఎంతో మంది ప్రయత్నిస్తారని, తాను ఎలాంటి ప్రయత్నం చేయకుండా ఆస్కార్ తనను వరించడం ఆనందమేనని చెప్పారు.
ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు గల జాకీచాన్ మాట్లాడుతూ, 'నేనెంత ఆప్ట్రాల్ చీప్ కామెడీ సినిమాలు చేసే నటుడిని' అని అన్నారు. అలాంటి తనను పిలిచి ఆస్కార్ ఇచ్చారంటే తానేదో చేసే ఉంటానని ఆయన చెప్పారు. ఆస్కార్ వరించిన మీరు వర్థమాన నటులు, యువతకు ఏ సందేశమిస్తారని ప్రశ్నించగా, తాను సందేశాలు ఇవ్వనని అన్నారు. తాను సందేశాలిచ్చేంత గొప్ప వ్యక్తిని కాదని తెలిపారు. అయితే ఒకటి మాత్రం చెప్పగలనని ఆయన చెప్పారు.
'పని చెయ్యిండి... అది నటన కావచ్చు, లైట్ బాయ్, కెమెరామెన్, ఇంకోపని.. మరోపని.. ఇలా పని ఏదైనా సరే చేస్తూ ఉండండి... ఏదో ఒకరోజు మీరు విజయవంతమవుతారు. గొప్పవారని కీర్తించబడతారు' అని చెప్పారు. పనిలో తేడాలు చూడకండని ఆయన సలహా ఇచ్చారు. తాను అలా 56 ఏళ్లుగా పని చేస్తుండడం వల్లే ఆస్కార్ తనను వెతుక్కుంటూ వచ్చిందని చెప్పారు. తాను ఆస్కార్ కోసం ఏ రోజూ ప్రయత్నించలేదని ఆయన తెలిపారు. తనకున్న పరిధిలో చైనా ప్రజలను ఆకట్టుకునేందుకే ప్రయత్నించానని ఆయన చెప్పారు. తన ప్రయత్నంలో ఏమాత్రం లోపం లేదని ఆయన అన్నారు. అందుకే ఆస్కార్ తనను వెతుక్కుంటూ వచ్చిందని అన్నారు. అలాగే మీరు కూడా కష్టపడితే ఆస్కార్ కంటే గొప్పవే వరిస్తాయని ఆయన తెలిపారు.