: హోదా కోసం ఆందోళన చేస్తున్న వారిని భయభ్రాంతులకు గురిచేయడం శోచనీయం: సీపీఐ రామకృష్ణ
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయడానికి యువత సిద్ధమైన అంశంపై అన్ని పార్టీల రాజకీయ నాయకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ హోదా పోరుకు మద్దతు పలుకుతున్నారు. విజయవాడలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పలువురు నేతలు ప్రత్యేక హోదాపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హోదా కోసం మాట్లాడితే జైలుకు పంపిస్తామని బెదిరించడం సరికాదని సీపీఐ నేత రామకృష్ణ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో చేయాలనుకుంటున్న నిరసనకు కూడా అడ్డుతగులుతూ భయభ్రాంతులకు గురిచేయడం శోచనీయమని అన్నారు.
ప్రత్యేక హోదా కోసం పోరాడటాన్ని సర్కారు నేరంగా చూస్తోందని, ఆందోళనకారులను బెదిరించేలా డీజీపీ సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు చూస్తోంటే దారుణంగా ఉన్నాయని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శించారు. ఉద్యమకారులను నిర్బంధిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసు రాజ్యాన్ని నడిపిస్తున్నారని సీపీఎం నేత మధు అన్నారు.