: విశాఖకు నేనైతే పోతున్నా... ఏం చేస్తారో చూస్తా: జగన్
ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ, రేపు విశాఖపట్నంలో తలపెట్టిన క్యాండిల్ ర్యాలీకి తాను హాజరు కానున్నట్టు వైకాపా అధినేత వైఎస్ జగన్ స్పష్టం చేశారు. శాంతియుతంగా తలపెట్టిన ర్యాలీని ఎలా అడ్డుకుంటారో చూస్తామని అన్నారు. "ర్యాలీలో పాల్గొన్న వారిని అరెస్ట్ చేయాలని, పీడీ కేసులు పెట్టాలని మీరు నిర్ణయం తీసుకుంటే, అది మీ వ్యక్తిగత విజ్ఞతకే వదిలేస్తున్నాను. నేనైతే అక్కడికి పోతున్నాను. కచ్చితంగా పార్టిసిపేట్ చేస్తున్నానని గట్టిగా చంద్రబాబునాయుడు గారికి చెబుతా ఉన్నా. అరెస్ట్ చేస్తారో... ఏం చేస్తారో... మీ ఇష్టం" అని జగన్ అన్నారు.
ఇప్పటికైనా చంద్రబాబుకు జ్ఞానోదయమైతే, క్యాండిల్ లైట్ ర్యాలీలో పాల్గొనాలని జగన్ కోరారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ఆయన కదలి రావాలని అన్నారు. ప్రత్యేక హోదా కావాలంటూ ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా, తాను మనస్ఫూర్తిగా మద్దతిస్తానని, అందరూ కలిస్తేనే, సునాయాసంగా హోదాను సాధించుకోగలుగుతామని అన్నారు. రాబోయే రోజుల్లో అందరూ చంద్రబాబు నాయకత్వంలో ఢిల్లీకి వెళ్దామని అన్నారు. ఎంపీలతో రాజీనామాలు చేయించి, దేశం మొత్తం చూసేలా ఎన్నికలకు వెళ్దామని అన్నారు.