: పుదుచ్చేరి మాజీ మంత్రి హత్య కేసులో ప్రధాన నిందితురాలి లొంగుబాటు.. ఆమె చాలా ఖతర్నాక్!
పుదుచ్చేరి మాజీ మంత్రి వీఎంసీ శివకుమార్ హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా భావిస్తున్న ఆర్.ఎళిలరసి పుదువై మంగళవారం కోర్టులో లొంగిపోయింది. జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ మూడో కోర్టు న్యాయమూర్తి ఎం.ధనలక్ష్మి ఎదుట లొంగిపోయిన ఆమెను తర్వాత కారైక్కాల్ కోర్టులో హాజరుపరిచారు. ఇటీవల జరిగిన శివకుమార్ హత్యకేసులో తన పాత్ర ఉందని ఆమె అంగీకరించింది.
లిక్కర్ కింగ్ రాము అలియాస్ రాధాకృష్ణన్ రెండో భార్య అయిన ఎళిలరసి చాలా ఖతర్నాక్. 2013లో రామును కొందరు హత్య చేశారు. భర్త హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు కొందరితో కలిసి ఓ ముఠాను తయారుచేసింది. 2014లో ట్రావెల్ ఏజెంట్‌ను హత్య చేసింది ఈ ముఠానే. 2015లో రాము మొదటి భార్యను కూడా ఎళిలరసి హత్య చేసింది. హత్యకు గురైన ఇద్దరూ రాము హత్య కేసులో ప్రధానపాత్ర పోషించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగానే వారిద్దరినీ ఎళిలరసి ముఠా హత్య చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. మాజీ మంత్రి శివకుమార్ హత్యకేసులోనూ ఎళిలరసి ప్రధాన పాత్ర పోషించినట్టు పోలీసులు పేర్కొన్నారు.