: ఏపీలో అద్దెల నియంత్రణకు కొత్త చట్టం.. నేడు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం!
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో విపరీతంగా పెరిగిపోతున్న అద్దెలను నియంత్రించేందుకు ప్రభుత్వం సరికొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు సమాయత్తమవుతోంది. అద్దె చట్టంపై నేడు(బుధవారం) జరగనున్న మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
రాజధాని ప్రాంతంలో నింగినంటుతున్న అద్దెల కారణంగా అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉందని భావిస్తున్న ప్రభుత్వం కొత్త చట్టానికి రూపకల్పన చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అలాగే స్వచ్ఛ ఏపీ పథకంలో భాగంగా ఎక్కడపడితే అక్కడ చెత్తవేసే వారిపై జరిమానా విధించడంపైనా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. దీంతోపాటు కర్నూలు జిల్లాలో నాలుగు వేల ఎకరాల్లో భారీ సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణంతోపాటు 1.20 లక్షల పక్కా ఇళ్ల నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్టు తెలుస్తోంది.