: గోవా ముఖ్యమంత్రిగా రక్షణ మంత్రి మనోహర్ పారికర్!.. నిజమేనన్న బీజేపీ అగ్రనేతలు
రక్షణ మంత్రి మనోహర్ పారికర్ గోవా ముఖ్యమంత్రి కానున్నారా? బీజేపీ అగ్రనేతల వ్యాఖ్యలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. త్వరలో గోవాలో జరగనున్న ఎన్నికల్లో బీజేపీ మరోమారు విజయం సాధిస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ స్థానంలో మనోహర్ పారికర్‌కు సీఎం పగ్గాలు అప్పగించాలని అధిష్ఠానం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
రెండు రోజుల క్రితం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా మాట్లాడుతూ గోవాలో తదుపరి ప్రభుత్వం మనోహర్ పారికర్ నేతృత్వంలో పనిచేస్తుందని పేర్కొనడం ఊహాగానాలకు మరింత ఊతమిస్తోంది. తాజాగా గోవా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వినయ్ టెండూల్కర్ కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. మనోహర్ సేవలు రాష్ట్రానికి అవసరమని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. పారికర్‌కు రాష్ట్రంతో మంచి సంబంధాలున్నాయని, ఆయన సేవలు రాష్ట్రానికి చాలా అవసరమని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. అయితే సీఎం అభ్యర్థి ఎవరనేది ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారని తెలిపారు.