: హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ప్ర‌మాదంపై కేంద్రం ఆగ్ర‌హం.. ఇది త‌న‌కు మాయ‌ని మ‌చ్చ‌గా మారింద‌న్న రైల్వేమంత్రి సురేశ్ ప్ర‌భు!


విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని కూనేరులో ఇటీవ‌ల జ‌రిగిన హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్ర‌మాదంపై కేంద్రం ప్ర‌త్యేక దృష్టి సారించింది. ప్ర‌మాదంపై పూర్తిస్థాయిలో ద‌ర్యాప్తు చేయ‌డంతోపాటు బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని యోచిస్తోంది. ఉన్న‌తాధికారుల ప‌ర్య‌వేక్ష‌ణ లోపంపైనా ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టింది. సీఐడీ, ఎన్ఐఏ, ఆర్పీఎఫ్‌లు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేయ‌డంతో  కొంద‌రు రైల్వే అధికారులు త‌ప్పును క‌ప్పి పుచ్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌మాదాన్ని విద్రోహ చ‌ర్య‌గా ప్ర‌క‌టించ‌డం ద్వారా ద‌ర్యాప్తు అధికారుల దృష్టిని మ‌రల్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు స‌మాచారం.

మ‌రోవైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి రాజ్య‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రైల్వే మంత్రి సురేశ్ ప్ర‌భు కూడా ప్ర‌మాదాన్ని  సీరియ‌స్‌గా ప‌రిగ‌ణిస్తున్నారు. ప్ర‌మాదం జ‌రిగిన ప్రాంతాన్ని ప‌రిశీలించిన ఆయ‌న ఘ‌ట‌న‌పై తీవ్రంగా వ్యాఖ్యానించిన‌ట్టు తెలిసింది. ఇంత పెద్ద ప్ర‌మాదం జ‌రిగి భారీ ప్రాణ‌న‌ష్టం  సంభవించ‌డం త‌న‌కు మాయ‌ని మ‌చ్చ‌గా మిగిలే ప్ర‌మాదముంద‌ని ప్ర‌జాప్ర‌తినిధుల వ‌ద్ద వ్యాఖ్యానించిన‌ట్టు స‌మాచారం. కాగా హిరాఖండ్ రైలు ప్ర‌మాదంలో మృతి చెందిన‌వారి సంఖ్య 41కి చేరింది.

  • Loading...

More Telugu News