: రైతు సమస్యల పరిష్కారానికి జల్లికట్టు ఉద్యమం తొలి అడుగు కావాలి: కమలహాసన్
జల్లికట్టు క్రీడ కంటే రైతుల సమస్య చాలా ముఖ్యమైనదని, దాని పరిష్కారానికి జల్లికట్టు ఉద్యమం తొలి అడుగు కావాలని ప్రముఖ సినీ నటుడు కమలహాసన్ అభిలషించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన జంతు పరిరక్షణ సంస్థ పెటాపై విరుచుకుపడ్డారు. జల్లికట్టును నిషేధించమని చెబుతున్న పెటా, వేలాది పశువుల్ని చంపి మాంసాన్ని ఎగుమతి చేస్తుంటే మాత్రం అడ్డుకోవడం లేదన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రైలు ప్రమాదంలో చాలామంది చనిపోయారని తెలిసి అయ్యో అని ఊరుకున్నామని, కానీ అదే రైలులో మనవాళ్లు ఉంటే చనిపోయింది ఇద్దరే అయినా తట్టుకోలేమని అన్నారు.
జల్లికట్టు విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు కూడా ఇదేనని అన్నారు. అసంతృప్తి నుంచి పుట్టిన విద్యార్థుల పోరాటం తనను కదిలించిందన్నారు. నాయకత్వం లేనందువల్లే ఉద్యమం దారి తప్పిందన్న వ్యాఖ్యలను కమల్ ఖండించారు. నిజమైన ఉద్యమానికి నాయకత్వం అవసరం లేదన్నారు. అయితే పోరాటంలో పాల్గొన్న వారందరూ మంచివారని మాత్రం చెప్పలేమని పేర్కొన్నారు. ప్రతిదాంట్లోనూ మంచి చెడులు ఉంటాయని, అంతమాత్రాన ఉద్యమకారులను ద్రోహులుగా చిత్రీకరించవద్దని కమలహాసన్ కోరారు.