: పెద్ద నోట్ల రద్దు, డిజిటల్ చెల్లింపులపై మధ్యంతర నివేదిక అందజేసిన చంద్రబాబు ఆధ్వర్యంలోని కమిటీ


పెద్ద నోట్ల రద్దు, డిజిటల్ చెల్లింపులపై ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన సీఎంల కమిటీ ప్రధానికి మధ్యంతర నివేదికను సమర్పించింది. ఇందులో డిజిటల్‌ చెల్లింపుల ప్రోత్సాహానికి 20 సూచనలు చేసింది. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి 3వేల కోట్ల డిజిటల్‌ చెల్లింపులు జరిగేలా చూడాలని కమిటీ సూచించింది. ఆధార్‌ ఆధారిత చెల్లింపుల విధానం తీసుకురావాలని కేంద్రాన్ని కోరింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకుల్లో మార్చి 31 నాటికి ఆధార్‌ ను తప్పనిసరి చేయాలని సిఫారసు చేసింది. డిజిటల్ లావాదేవీలపై ఉన్న అన్ని రకాల ఛార్జీలు ఎత్తివేయాలని కోరింది. అంతే కాకుండా డిజిటల్ చెల్లింపుల్లో భాగం చేయడంలో భాగంగా తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ స్మార్ట్ ఫోన్ కొనుగోలులో 1000 రూపాయల డిస్కౌంట్ ఇవ్వాలని సూచించింది.

అలాగే డిజిటల్‌ చెల్లింపుల ప్రోత్సాహానికి ప్రతిఒక్కరికీ నెలకు 100 ఎంబీ డేటా ఉచితంగా ఇవ్వాలని చెప్పింది. అన్ని బ్యాంకుల లావాదేవీలను పర్యవేక్షించేలా డ్యాష్‌ బోర్డు ఏర్పాటు చేయాలని కోరింది. ఆర్బీఐ, జీఐఎస్‌ డ్యాష్‌ బోర్డును నిర్వహించాలని, డిజిటల్‌ చెల్లింపుల ప్రగతి పర్యవేక్షణకు స్థాయీ సంఘం ఏర్పాటు చేయాలని సూచించింది. డిజిటల్ చెల్లింపుల్లో సరైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. ఈ సంఘం అధ్యక్షుడిగా చంద్రబాబునాయుడు వ్యవహరిస్తుండగా, నీతి ఆయోగ్ చీఫ్ అరవింద్ పణగారియాలతో పాటు మరో ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా వున్నారు. 

  • Loading...

More Telugu News