: మందుపాతరపై పొరపాటున కాలేసిన స్నిఫర్ డాగ్ ప్లూటో మృతి!
మావోయిస్టులు అమర్చిన మందుపాతరను పసిగట్టిన స్నిఫర్ డాగ్ ప్లూటో, పొరపాటున దానిపై కాలువేయడంతో ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఛత్తీస్ గడ్ లోని బీజాపూర్ అడవుల్లో ఈరోజు ఉదయం జరిగింది. సీఆర్పీఎఫ్ 229వ బెటాలియన్ కు చెందిన ప్లూటోను వెంటబెట్టుకుని నిన్న రాత్రి తిమ్మాపూర్-ముర్దాండల మధ్య గల అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. అర్ధరాత్రి తర్వాత మావోయిస్టుల కోసం కూంబింగ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. ఈరోజు ఉదయం ముర్దాండ సమీపానికి ఈ బృందం చేరుకుంది.
జవాన్ల కంటే ముందుగా నడుస్తూ వెళ్లిన ప్లూటో, దారి మధ్యలో అమర్చిన మందుపాతరను గుర్తించడంతో పాటు మొరగడం ప్రారంభించింది. అయితే, పొరపాటున ప్లూటో కాలు మందుపాతరపై పడి పేలింది. ఈ సంఘటనలో ప్లూటో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయాన్ని సీఆర్పీఎఫ్ అధికారి ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ప్లూటో మరణం తమ బెటాలియన్ కు చాలా నష్టమని, జవాన్లకు ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్లూటోకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశారు.