: మంచి స్టోరీ ఉంటే టీవీ సీరియల్స్ లో నటించాలని ఉంది: మోహన్ బాబు
మంచి కథ ఉంటే టీవీ సీరియల్స్ లో నటించాలని తనకు ఉందని ప్రముఖ సీనియర్ నటుడు మోహన్ బాబు అన్నారు. ప్రముఖ దర్శకుడు, మోహన్ బాబు సినీ గురువు దాసరి నారాయణరావు బుల్లి తెరకెక్కించిన ‘అభిషేకం’ సీరియల్ 2,500 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో మోహన్ బాబు మాట్లాడుతూ, ‘టీవీ ఆర్టిస్టులందరికి నా హృదయ పూర్వక అభినందనలు. అసలు టీవీ నటులు ఒక నటులేనా? అని కొందరు అనుకుంటూ ఉంటారు. అలా ఎవరైతే అనుకుంటారో వాళ్లే నటులు కాదు. ముందు ఎవరికైనా ఒక వేదిక కావాలి. అక్కడ మన ప్రతిభ కనబరచాలి. ఆ స్టేజ్ పై కలం పని చేసింది కాబట్టే దాసరి నారాయణరావు గారు, మా గురువు గారు ఇంతటి గొప్ప వ్యక్తి అయ్యారు. మా రోజుల్లో వీధి నాటకాలు ఉండేవి. టీవీ ఆర్టిస్టులంటే నాకు ఎంతో గౌరవం, ప్రేమ. ఎందుకంటే, టీవీ షోలలో నటించాలని నేనూ అనుకునేవాడిని. కానీ, ఓపిక, సమయం లేక, పని ఒత్తిడి వల్ల చేయలేకపోయాను. అయితే, మంచి స్టోరీ ఏదైనా దొరికితే టీవీ సీరియల్స్ లో నటించాలనే కోరిక మాత్రం ఇంకా ఉంది’ అని మోహన్ బాబు పేర్కొన్నారు.