: పోలీసుల తీరు షాక్ కు గురిచేసింది: కమలహాసన్
‘జల్లికట్టు’ ఆందోళనకారులను తరిమి కొట్టే సమయంలో పోలీసులు హింసకు దిగడంపై ప్రముఖ నటుడు కమల హాసన్ మండిపడ్డారు. ఆటోలకు పోలీసులే నిప్పు పెట్టిన వీడియోను కమల్, తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పోలీసుల తీరు తనను షాక్ కు గురిచేసిందని, ఈ ఘటనపై పోలీసులు వివరణ ఇస్తారని ఆశిస్తున్నానని అన్నారు. యువతపై జరిగిన పోలీసుల లాఠీఛార్జిని తాను ఖండిస్తున్నానని, జల్లికట్టు క్రీడపై నిషేధం ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని స్పష్టం చేస్తున్నదని విమర్శించారు.
దేన్నీ నిషేధించవద్దని, కేవలం ఆంక్షలు మాత్రమే విధించాలని కమల్ సూచించారు. జంతు హక్కులపై తనకు అవగాహన లేదని, ‘జల్లికట్టు’ ఉద్యమం సంస్కృతి పరిరక్షణ కోసం జరుగుతున్నదని అన్నారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ అంశంపై కూడా కమల్ మాట్లాడారు. ఆ దేశాన్ని విమర్శించడం తనకు ఇష్టం లేదని, సరిహద్దులు అనేవి మనమే సృష్టించుకున్నామని అభిప్రాయపడ్డారు. ఒకవేళ తాను 1924లో కనుక జన్మించి ఉంటే, దేశాన్ని విభజించ వద్దంటూ మహాత్మా గాంధీని వేడుకునేవాడినని కమల్ చెప్పుకొచ్చారు.