: రాజకీయ నాయకుడెవరైనా అలా మాట్లాడతారా?: జగన్ పై అయ్యన్న పాత్రుడు ఫైర్
వైసీపీ అధినేత జగన్ పై మంత్రి అయ్యన్న పాత్రుడు నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదాపై జగన్ కు అసలు అవగాహనే లేదని అన్నారు. రాజకీయ నాయకుడు ఎవరైనా జల్లికట్టుకు, ప్రత్యేక హోదాకు ముడి పెడతారా? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్రం కోసం ఇక్కడ ధర్నాలు చేస్తే ప్రయోజనం లేదని... ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతో మాట్లాడొచ్చు కదా? అని అన్నారు. జనవరి 26న విశాఖ ఆర్కే బీచ్ లో యువత చేపడుతున్న నిరసనకు పవన్ కల్యాణ్ మద్దతు తెలపడం సరైనది కాదని చెప్పారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన పైవ్యాఖ్యలు చేశారు.