: తమ సంప్రదాయ 'కంబళ' కోసం గళమెత్తుతున్న కన్నడ కేంద్ర మంత్రులు!
తమిళనాడు ప్రజలు తమ సంప్రదాయ జల్లికట్టు కోసం పోరాడిన స్ఫూర్తితో ఇప్పుడు కన్నడిగులు కూడా గళమెత్తుతున్నారు. తమ సంప్రదాయ క్రీడ కంబళ కోసం ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. కర్ణాటకలోని ఉడుపి, మంగళూరు, దక్షిణ కన్నడ ప్రాంతాలలో ఈ క్రీడను నిర్వహిస్తారు. బురద మడుల్లో ఎద్దులు, ఆంబోతులను కాడికి కట్టి పరుగులు తీయిస్తారు. నిర్ణీత దూరాన్ని ఏ పశువులైతే ముందుగా చేరుకుంటాయో... ఈ పోటీలో అవే విజేతలు. సంక్రాంతి పండుగ తర్వాత ఈ పోటీలు జరుగుతుంటాయి. అయితే, జంతు హక్కుల సంస్థ గత ఏడాది ఈ పోటీలను నిర్వహించరాదంటూ హైకోర్టులో పిటిషన్ వేసి, కంబళ జరగకుండా స్టే తెచ్చింది. దీంతో, ఈ ఏడాది ఆ పోటీలు జరగలేదు.
మరోవైపు, ఈ పోటీలకు అనుమతి కోసం ప్రధాని మోదీతో మాట్లాడతానని కర్ణాటకకు చెందిన కేంద్ర మంత్రి సదానందగౌడ తెలిపారు. ఈ పోటీల్లో ఎట్లాంటి హింస, ప్రాణహాని, ప్రమాదాలు ఉండవని ఆయన తెలిపారు. ఆ రాష్ట్రానికే చెందిన మరో కేంద్ర మంత్రి అనంతకుమార్ మాట్లాడుతూ, కంబళ క్రీడ కర్ణాటక ప్రజల హక్కు అని అన్నారు. తాను కూడా ప్రధానితో చర్చలు జరుపుతానని తెలిపారు.