: తస్లీమా నస్రీన్ సంచలన వ్యాఖ్యలు... భారత్ కు ఉమ్మడి పౌరస్మృతి అత్యవసరం
భారత్ కు ఉమ్మడి పౌరస్మృతి అత్యవసరమని ప్రవాస బంగ్లాదేశీ రచయిత్రి తస్లీమా నస్రీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జైపూర్ లోని డిగ్గీ ప్యాలెస్ లో జరిగిన జైపూర్ సాహిత్య ఉత్సవానికి ఆమె హాజరయ్యారు. ‘ప్రవాసం’ పేరిట నిర్వహించిన సెషన్ లో తస్లీమా మాట్లాడుతూ, ముస్లిం మహిళలు అణచివేయబడుతున్నారని, వారి రక్షణ కోసం ఉమ్మడి పౌరస్మృతి అవసరమని అభిప్రాయపడ్డారు. ఇస్లాంను విమర్శించడమే ఇస్లామిక్ దేశాల్లో లౌకికవాదం నెలకొల్పడానికి మార్గమని అన్నారు. 'నేను కానీ, ఇతరులు కానీ హిందూయిజం, బుద్ధిజం లేదా ఇతర మతాలను విమర్శించనప్పుడు ఏమీ జరగదు. కానీ, ‘ఇస్లాం’ను విమర్శించిన వెంటనే మిమ్మల్ని జీవితకాలం వెంటాడుతూనే ఉంటారు. ఫత్వాలు జారీ చేస్తారు, చంపాలని చూస్తారు' అని అన్నారు. ఆ విధంగా వాళ్లు ఎందుకు చేస్తున్నారు? నాతో ఏకీభవించనప్పుడు, వాళ్లు కూడా నాకు వ్యతిరేకంగా రాయవచ్చు కదా? అని అన్నారు. అందరిలాగే వాళ్లు కూడా తమ అభిప్రాయాలను వెల్లడించవచ్చని, ఫత్వాలకు బదులు సంభాషించవచ్చు కదా? అని ఆమె సూచించారు.