: జల్లికట్టులో అపశ్రుతి.. ఎద్దు కుమ్మడంతో రిజర్వ్ కానిస్టేబుల్ మృతి
తమిళనాడులో జల్లికట్టుకు మద్దతుగా ఎగసిన ఉద్యమానికి తలొగ్గిన ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జల్లికట్టు క్రీడను ఆనందోత్సాహాల మధ్య నిర్వహిస్తున్నారు. అయితే తమిళనాడులోని విరుదునగర్‌లోని కన్సాపురంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన క్రీడలో అపశ్రుతి చోటుచేసుకుంది. విధినిర్వహణలో ఉన్న ఓ రిజర్వ్ కానిస్టేబుల్ వి.శంకర్(29)ను ఎద్దు కుమ్మేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. జల్లికట్టును చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో వారిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో వెనకనుంచి వచ్చిన ఎద్దు అతడిపై దాడిచేసింది. కొమ్ములతో పొడుస్తూ బీభత్సం సృష్టించింది. తీవ్ర గాయాలపాలైన అతడు ఘటనా స్థలంలోనే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.