: ముంబైలో జాకీచాన్ కు సాదర స్వాగతం
ప్రముఖ హాలీవుడ్ నటుడు, సూపర్ స్టార్ జాకీ చాన్ భారత్ లో మరోసారి అడుగుపెట్టారు. గతంలో తన సినిమా షూటింగ్ కోసం జైపూర్ వంటి ప్రాంతాల్లో తిరిగిన జాకీచాన్, తాజాగా భారతీయ నటులతో కలిసి రూపొందించిన కొత్త సినిమా 'కుంగ్ ఫూ యోగా' ప్రమోషన్ కోసం ముంబై చేరుకున్నారు. దీంతో ఆయనకు ఆ సినిమాలో నటిస్తున్న బాలీవుడ్ నటుడు సోనూ సూద్ సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆయనను ఫిల్మ్ సిటీకి తీసుకెళ్లారు.
అక్కడ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం ఆయన గౌరవార్థం సోనూ సూద్ ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ఈ సినిమాలో నటించిన దిశాపటానీ (లోఫర్ ఫేం) తో పాటు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తదితరులు పాల్గొననున్నారు. కాగా, జాకీని కలవాలని గతంలో చాలా మంది బాలీవుడ్ నటులు సోనూ సూద్ ను కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ లో ఈ సినిమా షూటింగ్ జరిగిన సందర్భంగా షారూఖ్, ఫరాఖాన్ తదితరులను జాకీ వద్దకు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.