: కర్ణాటక మంత్రి ఇంట్లో 112 కోట్ల రూపాయలు, 12 కేజీల బంగారం
కర్ణాటక మంత్రి నివాసంపై దాడులు జరిపిన ఐటీ అధికారులు అక్కడ దొరికిన నగలు, నగదు చూసి ఆశ్చర్యపోయారు. వివరాల్లోకి వెళ్తే... కర్ణాటక చిన్నపరిశ్రమల శాఖ మంత్రి సతీష్ జర్కీహోలి లెక్కలేనన్ని అక్రమాస్తులు సంపాదించినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆదాయపు పన్ను శాఖాధికారులు ఆయన, ఆయన బంధువులు, బినామీల ఇళ్లపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అధికారులు ఊహించని విధంగా 12 కేజీల బంగారం, 112 కోట్ల రూపాయల నగదు లభ్యమయ్యాయి. లెక్కల్లో చూపని పెద్ద మొత్తాన్ని చూసిన అధికారులు అవాక్కయ్యారు. దీంతో మంత్రి, ఆయన కుటుంబ సభ్యులను ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తం మంత్రి దగ్గర వెలుగు చూడడంతో కర్ణాటకలో కలకలం రేగుతోంది.